mahendra singh dhoni: రిటైర్మెంట్ గురించి ధోనీ ఏమన్నాడంటే...!
- దుబాయ్ లో గ్లోబల్ క్రికెట్ అకాడమీ స్థాపించిన ధోనీ
- తన రిటైర్మెంట్ పై ఎవరి అభిప్రాయాలు వారివి... గౌరవించాల్సిందే!
- దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయం
- అంతకంటే స్ఫూర్తినిచ్చే అంశం మరొకటి లేదు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుబాయ్ లో గ్లోబల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్ పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లవని అన్నాడు. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇక తన వరకు వస్తే దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్పవిషయమని అన్నాడు.
మనం మహా అయితే 70 ఏళ్లు జీవించగలం అనుకుంటే, అందులో కేవలం పది నుంచి పదిహేనేళ్ల పాటు మాత్రమే జట్టుకు ప్రాతినిధ్యం వహించగలమని, అంత కాలం ఆడితే సుదీర్ఘ కాలం ఆడినట్టేనని, అదే స్ఫూర్తినిచ్చే విషయమని అన్నాడు. తాను ఫలితం కంటే ప్రయత్నంపైనే ఎక్కువ దృష్టి సారిస్తానని తెలిపాడు.
మ్యాచ్ పూర్తయిన తరువాత అద్దం ముందు నిలబడి మనతో మనం నూటికి నూరు శాతం నిజాయతీగా, పూర్తి సామర్థ్యంతో ఆడానని చెప్పుకోగలిగితే చాలని, ఫలితం దానంతట అదే వస్తుందని ధోనీ అన్నాడు. పొతే, ఈ శిక్షణా కేంద్రంలో భారతీయ క్రికెట్ శిక్షకులు దుబాయ్ లో బాలలకు మెలకువలు నేర్పించనున్నారు.