simbhu: నేనెవరికీ భయపడనంటున్న శింబు.. 'జీఎస్టీ' పాటపై వివరణ!
- పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ విధానాలపై పాట పాడిన శింబు
- సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకున్న పాట
- శింబుకు బెదిరింపులు వచ్చాయని తమిళనాట ప్రచారం
- తనను ఎవరూ బెదిరించలేదని, బెదిరించినా బెదిరే వ్యక్తిని కాదని స్పష్టీకరణ
కోలీవుడ్ నటుడు శిలంబరసన్ (శింబు) తనకు ఎవరి నుంచీ ఎటువంటి బెదిరింపులు రాలేదని తెలిపాడు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ పన్ను విధానాలతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ఈ మధ్య ఒక పాటను శింబు పాడిన సంగతి తెలిసిందే. 'మెర్సల్' సినిమాలోని డైలాగులతో బీజేపీ నేతలు, సినీ పరిశ్రమ మధ్య మాటల తూటాలు పేలిన నేపథ్యంలో శింబు పాట కూడా వివాదం రేపింది. ఈ పాటను ప్రముఖ రచయిత వైరముత్తు కొడుకు కపిలన్ రాయగా, శింబు పాడారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ నేపథ్యంలో శింబుకు బెదిరింపులు వచ్చాయని, శింబుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శింబు సోషల్ మీడియా మాధ్యమంగా స్పందించారు. తన పాట ప్రజలను ఆకట్టుకుంటోందని అన్నారు. తనకు ఎవరి నుంచీ బెదిరింపులు రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తనను బెదిరించే ప్రయత్నం చేసినా, తాను బెదిరిపోయే మనిషిని కాదని ఆయన తెలిపారు. తన పాట ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే కనుక క్షమించాలని ఆయన అన్నారు. కాగా, గతంలో శింబు పాడిన బీప్ సాంగ్ పెను వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే.