tumhari sulu: బరువు ఎప్పుడు తగ్గుతారన్న విలేకరి.. మైండ్ సెట్ మార్చుకోమన్న విద్యాబాలన్!
- బరువు ఎప్పుడు తగ్గుతారు? అంటూ విద్యాను ప్రశ్నించిన జర్నలిస్ట్
- ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బదులు మహిళలపై మీ ఆలోచనా విధానం మార్చుకోండన్న విద్య
- నాకు లభించే పాత్రలతో నేను హ్యాపీగానే ఉన్నాను
‘తుమారీ సులు’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ ఓ జర్నలిస్టుకు ఘాటైన సమాధానమిచ్చింది. దాని వివరాలలోకి వెళ్తే... ‘తుమారీ సులు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో లేట్ నైట్ ఆర్జే పాత్రలో నటించిన విద్యాబాలన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలో మీడియాతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒక విలేకరి ఆమెను బరువు ఎప్పుడు తగ్గుతారు? గ్లామర్ పాత్రల్లో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందిస్తూ, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బదులు మహిళల విషయంలో మీ ఆలోచనా విధానాన్ని (మైండ్ సెట్) మార్చుకుంటే చాలా బాగుంటుందని సమాధానమిచ్చింది. తనకు లభించే పాత్రలతో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె స్పష్టం చేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు, బరువు తగ్గడానికి మధ్య సంబంధం ఏంటి? అని ఆమె ఆయనను నిలదీసింది. ఆమె నవ్వుతూనే అలా అనడంతో సదరు జర్నలిస్టు మౌనం దాల్చాడు.