boat accident: బోటు ప్రమాదంలో సీపీఐ నారాయణ బంధువుల మృతి!

  • పడవ ప్రమాదంలో సీపీఐ నారాయణ బావమరిది పాపారావు భార్య మృతి
  • ఇంకా దొరకని పాపారావు కోడలు హరిత, మనవరాలు అశ్వికల మృతదేహాలు
  • విషాదంలో మునిగిపోయిన నారాయణ కుటుంబం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో సీపీఐ నేత నారాయణ బంధువులు కూడా మృత్యువాతపడడం వారి కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. నారాయణ భార్య వసుమతీదేవి సోదరుడు పాపారావు భార్య లలిత, కోడలు హరిత, మనవరాలు అశ్వికలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యంకాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు పాపారావు భార్య లలిత మృతదేహాన్ని గుర్తించారు.

ఇక హరిత, అశ్విక మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై నారాయణ మాట్లాడుతూ, అనుమతులు లేకుండా బోట్ ను ఎలా నడవనిచ్చారని ప్రశ్నించారు. బోట్ నడిచిన విధానం చూస్తుంటే టూరిజం శాఖాధికారుల అనుమతితోనే ధైర్యంగా నడిపినట్టు అర్థమవుతోందని అన్నారు.

ఇక్కడ ప్రజలు కూడా ఒకటి గమనించాలని, హారతి పేరుతో జరిగేది ప్రచారం తప్ప ఏమీ కాదని అన్నారు. అక్కడ ఏ అద్భుతాలు జరగలేదని, ప్రభుత్వం ప్రచారం కోసం నిర్వహిస్తున్న అలాంటి కార్యక్రమాలు చూడడం వల్ల లభించేది ఏం ఉంటుందని ఆయన అడిగారు. కేవలం ఇలాంటి ప్రచారం కారణంగా కలిగిన ఉత్సాహం వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News