weirdest sea creatures: 300 దంతాలతో చూడటానికే భయంకరంగా ఉన్న షార్క్ చేపను గుర్తించిన శాస్త్రజ్ఞులు!
- అట్లాంటిక్ సముద్రంలో శాస్త్రవేత్తల బృందం
- సాధారణం కంటే లోతుగా సముద్రంలో ప్రయాణిస్తుండగా కనపడిన ఫ్రిల్డ్ షార్క్
- ఏనాడో అంతరించిపోయాయని కొందరి అభిప్రాయం
- కొన్ని దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు కనపడిన షార్క్
యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తల బృందం పాములాంటి తల ఆకారంలో ఉన్న షార్క్ చేపను గుర్తించింది. ఈ షార్క్ 300 దంతాలతో చూడటానికే భయంకరంగా ఉంది. శాస్త్రవేత్తలు పోర్చుగల్ తీరంలోని అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లిన సమయంలో ఈ షార్క్ కనపడింది. కమర్షియల్ ఫిషింగ్‌లో భాగంగా అనవసర సముద్ర జీవుల వేటను తగ్గించే మార్గాలను వెతుకుతూ శాస్త్రవేత్తలు సముద్రంలోకి వెళ్లారు.
సాధారణం కంటే లోతుగా సముద్రంలో వారు ప్రయాణిస్తుండగా ఈ షార్క్ కనపడింది. దీన్ని ఫ్రిల్డ్ షార్క్‌గా పిలుస్తారు. ఈ షార్క్ తన దంతాలతో మరో షార్క్‌ను కూడా చీల్చి తినగలదు. ఈ షార్క్‌లు సాధారణంగా జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని సముద్ర ప్రాంతాల్లో కనపడుతుంటాయి. అయితే, సముద్రంలో చాలా లోతులో ఇవి ఉంటుంటాయి. ఈ రకం అరుదైన షార్క్ చేపలను 19వ శతాబ్దానికి చెందిన నావికులు మొదటిసారి గుర్తించారు. ఈ షార్క్ జాతి చేపలు ఎన్నడో అంతరించిపోయాయని ఇన్నాళ్లూ కొందరు భావించారు. ఈ షార్క్ చేప దాదాపు ఆరు అడుగుల వరకు పెరుగుతుంది. కొన్ని దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు కనపడింది.