Chandrababu: పడవ ప్రమాద కారణాన్ని వివరించిన సీఎం చంద్రబాబు!
- పడవను నడిపేవారికి అనుభవం లేదు
- అజాగ్రత్త వల్లే పడవ ప్రమాదం
- పడవలో అందరూ ఒక్కవైపునకు ఒరిగారు
- పడవలో మొత్తం 45 మంది ఉన్నారు
పడవను నడిపేవారికి అనుభవం లేకపోవడం, ఆ బోటును నిర్వహిస్తోన్న వారి అజాగ్రత్త వల్లే విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కృష్ణా పవిత్ర సంగమం వద్ద నిన్న సాయంత్రం పడవ బోల్తా పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలియజేశారు. బోటు వెళుతోన్న సమయంలో అందరూ ఒక పక్కకు ఒరిగారని, డ్రైవర్‌కి కూడా అనుభవం లేదు కాబట్టి అదుపు చేయలేకపోయాడని చెప్పారు. రూట్ గురించి కూడా డ్రైవర్‌కి తెలియదని అన్నారు. దీంతో బోటు తిరగబడిందని చెప్పారు. కొందరి ప్రాణాలను రక్షించిన వారిని అభినందిస్తున్నానని అన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు నాయుడు అన్నారు. ముగ్గురు పడవ సిబ్బంది గల్లంతయ్యారని చెప్పారు. ముగ్గురు బోటు సిబ్బందితో పాటు ఆ పడవలో 45మంది ప్రయాణించారని చెప్పారు. బాధ్యతలేని వ్యక్తుల వల్లే కొందరు ప్రాణాలు కోల్పోయారని, పలువురుని రక్షించడంలో ఇద్దరు మత్స్యకారులు చాలా కష్టపడ్డారని, మత్య్సకారులు నడికుదిటి పిచ్చయ్య, కన్నా శివయ్యను అభినందిస్తున్నానని తెలిపారు. అనంతరం శాసనసభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.