jabardasth: అవును నాకు పొట్ట ఉంది.. బట్ట ఉంది: 'జబర్దస్త్ ఆది'పై మహేశ్ కత్తి ఆగ్రహం
- జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది పంచ్ డైలాగులు
- వివాహం అనేది సినిమా తీసినంత కష్టం అన్న హైపర్ ఆది
- అదే సమయంలో సినిమా రివ్యూలపై సెటైర్
- మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారన్న మహేశ్ కత్తి
'జబర్దస్త్' కామెడీ షోలో పంచ్ డైలాగులు వేస్తూ కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆదిపై సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. జబర్దస్త్లో హైపర్ ఆది స్కిట్లో భాగంగా ఇటీవల ఒక డైలాగు చెప్పాడు. వివాహం అనేది సినిమా తీసినంత కష్టం అని, కానీ ప్రేమ మాత్రం ముందు పొట్ట వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ అని డైలాగ్ వేశాడు. ఆ డైలాగు గురించి తెలుసుకున్న మహేశ్ కత్తి తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
'అవును, నాకు పొట్ట ఉంది, బట్ట ఉంది' అని వ్యాఖ్యానించాడు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండడమే ఈ ప్రపంచం అని చెప్పాడు. కాస్త భిన్నంగా ఉంటే జోకర్స్ అయిపోతామా? అని ప్రశ్నించాడు. ఒకరు పొడుగ్గా, ఇంకొకరు పొట్టిగా, ఒకరు నల్లగా, ఇంకొకరు తెల్లగా ఉండొచ్చని, కొందరికి నత్తి ఉండొచ్చని, కొందరికి తనలా బట్టతల ఉండొచ్చని చెప్పాడు. దట్ ఈజ్ మై స్టయిల్ అని వ్యాఖ్యానించాడు.
ఇలా ఉన్నానని తాను బాధపడిపోనని, తనది అటువంటి మెంటాలిటీ కాదని చెప్పుకొచ్చాడు. మనుషుల మీద, వారు వేసుకునే బట్టల మీద ఇలా మాట్లాడుతూ అపహాస్యం చేస్తున్న దానిని కామెడీ అంటున్నారని, దాన్ని చూసి ఆనందపడుతున్నారని చెప్పాడు. ఇది మన దిగజారుడు తనమని మహేశ్ వ్యాఖ్యానించాడు.