China: చైనాకు ఝలక్ ఇచ్చిన నేపాల్.. ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు!
- బుదీ గండకి నదిపై విద్యుత్కేంద్రం నిర్మించాలని చైనా గుజువా కంపెనీకి కాంట్రాక్టు
- పనుల్లో అవకతవకల ఆరోపణలు
- కాంట్రాక్టును రద్దు చేసిన నేపాల్
నేపాల్ చిన్న దేశమే అయినా ఎవరూ ఊహించని విధంగా చైనాకు ఝలక్ ఇచ్చింది. నేపాల్ మాజీ ప్రధాని ప్రచండ హయాంలో 'బుదీ గండకి' ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు పనులను చైనాకి చెందిన గుజువా గ్రూప్ కు ఇచ్చింది. మధ్య నేపాల్ గుండా ప్రవహించే బుదీ గండకి నదిపై జలవిద్యుత్కేంద్రంతో పాటు ఇతర పనులను కూడా నేపాల్ చైనా కంపెనీకి కేటాయించింది.
అయితే ఈ ప్రాజెక్టులో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్ ఉపప్రధాని కమల్ థాపా తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. నేపాల్ మంత్రి వర్గం మొత్తం సమావేశమై చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గుజువా కంపెనీ పనులు సక్రమంగా చేపట్టడం లేదని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.