Mumbai: బ్యాంకుకు సొరంగం తవ్వి.. 27 లాకర్లను లూటీ చేసిన దొంగలు!
- పక్కనే ఉన్న షాపు నుంచి సొరంగం తవ్విన దొంగలు
- స్ట్రాంగ్ రూమ్ తెరవడంతో చోరీ వెలుగులోకి
- నిందితుల వేటలో పోలీసులు
ముంబైలోని ఓ బ్యాంకులో జరిగిన దోపిడీ పోలీసులకు సవాలుగా మారింది. పథకం ప్రకారం దోచుకున్న దొంగలు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. నవీ ముంబైలోని జుయ్‌నగర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ ఉంది. శని, ఆదివారాల సెలవు తర్వాత సోమవారం బ్యాంకును తెరిచిన అధికారులు యథావిధిగా బ్యాంకు కార్యకలాపాల్లో మునిగిపోయారు. అయితే ఓ ఖాతాదారుడు తన లాకర్‌ను ఓపెన్ చేసేందుకు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లగా చోరీ విషయం బయటపడింది. స్ట్రాంగ్ రూమ్‌లోని లాకర్లు అప్పటికే ఓపెన్ చేసి ఉండడాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. క్షుణ్ణంగా పరిశీలించగా బ్యాంకుకు ఓ మూల చిన్న సొరంగం లాంటిది కనిపించింది. దొంగలు దాని గుండా లోపలికి వచ్చి లాకర్లను దోచుకున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 27 లాకర్లు చోరీకి గురైనట్టు నిర్ధారించారు. బ్యాంకు పక్కనే ఉన్న షాపు నుంచి సొరంగం తవ్వినట్టు గుర్తించారు. దొంగలు దోచుకున్న వాటిలో ఎక్కువగా బంగారు ఆభరణాలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. లాకర్లలో దాచుకున్న వస్తువులపై ఖాతాదారుల నుంచి బ్యాంకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, అంతపెద్ద దొంగతనం జరిగినా బ్యాంకులోని సెక్యూరిటీ అలారం మోగకపోవడం అనుమానాలకు తావిస్తోంది.