Krishna River: ప్రమాదం నుంచి ఇలా బయటపడ్డాం.. వెల్లడించిన బోటు ప్రమాద బాధితులు!
- మృత్యుంజయుల మనోగతం
- బోటులో వేలాడడం వల్లే బతికి బయటపడ్డామన్న బాధితులు
- తమ కళ్లముందే కుటుంబ సభ్యులు మృతి చెందారంటూ కన్నీటి పర్యంతం
కృష్ణానదిలో బోటు ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తామెలా బయటపడిందీ వివరించారు. ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదం నుంచి బొడ్డు లక్ష్మి, కఠారి భూలక్ష్మి, రావిపాటి సుబ్బాయమ్మ, డి.విజయశ్రీలు గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కఠారి భూలక్ష్మి సోమవారం ఉదయం కన్నుమూశారు. బొడ్డు లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారు కోలుకుంటున్నారు. కోలుకుంటున్న సుబ్బాయమ్మ, విజయశ్రీలు తామెలా తిరిగి పునర్జన్మ పొందిందీ వివరించారు.
సుబ్బాయమ్మ మాట్లాడుతూ తాను ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు నుంచి వచ్చానని వివరించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పున్నమి బోటింగ్ పాయింట్ నుంచి బయలుదేరామని, అక్కడి నుంచి గంటలోనే పవిత్ర సంగమానికి చేరుకున్నట్టు వివరించారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణానికి మరో గంట పడుతుందని అనుకుంటుండగానే బోటు తిరగబడిందని పేర్కొన్నారు.
తాను బోటుపై ఉన్న ఇనుప రాడ్డును పట్టుకుని వేలాడుతూ ఉండిపోయానని, అలా వేలాడడం వల్లే బతికి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. నీళ్లలో మెడ వరకు మునిగిన తాను గంటకుపైగా వేలాడుతూనే ఉన్నానని వివరించారు. ప్రమాదం గురించి తెలిసి రక్షించేందుకు వచ్చిన వారితో తాను బతికే ఉన్నానని చెప్పడంతో ఒడ్డుకు చేర్చారని సుబ్బాయమ్మ వివరించారు. ప్రమాదంలో తన అన్నయ్య మృతి చెందారని, మిగిలిన వారు ఎలా ఉన్నారో కూడా తెలియదని కన్నీటి పర్యంతమయ్యారు.
నెల్లూరుకు చెందిన విజయశ్రీ మాట్లాడుతూ కార్తీక దీపోత్సవం కోసం అక్క కుమార్తె హరిత పిలవడంతో విజయవాడ వచ్చానని, అక్కడి నుంచి పవిత్ర సంగమానికి వెళ్లాలని అనుకున్నట్టు చెప్పారు. పున్నమిఘాట్కు వచ్చాక బోటులో పవిత్ర సంగమానికి వెళ్దామన్నారని గుర్తు చేసుకున్నారు. అయితే మార్గమధ్యంలోనే బోటు బోల్తా పడిందని, తాను నీటిలో పడిపోయి బోటును పట్టుకుని వేలాడుతూ ఉండడం వల్లే పునర్జన్మ లభించిందని పేర్కొన్నారు. తనతోపాటు వచ్చిన అక్క కుమార్తె హరిత, ఆమె కుమార్తె అశ్విక, అత్తయ్య లలితాంబ చనిపోయినట్టు వివరించారు.