lakshmi parvathi: కేతిరెడ్డిలాంటి పాపులు ఇక్కడకు వచ్చారు.. అందుకే పాలతో శుద్ధి చేశా: లక్ష్మీపార్వతి
- 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా నన్ను, ఎన్టీఆర్ ను అవమానించడమే
- నా పేరుతో సినిమా తీసేటప్పుడు.. నా పర్మిషన్ తీసుకోరా?
- సినిమాను అడ్డుకుంటా
'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను తీయడం ముమ్మాటికీ ఎన్టీఆర్ ను అవమానించడమేనని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తనను అవమానించాలన్న ఉద్దేశంతోనే... ఎన్టీఆర్ ను సైతం అగౌరవపరిచేలా కొందరు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ తీయనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు పోటీగానే... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను తీస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. ఘాట్ వద్ద ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను, ఎన్టీఆర్ ను అవమానించేలా... చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీయాలనుకుంటే.. ఆ సినిమాను అడ్డుకుంటామని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా ముహూుర్తపు షాట్ ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద తీసేందుకు కేతిరెడ్డి యత్నించగా... బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. దీంతో, అక్కడి షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, తన అనుమతి లేకుండా తన జీవిత చరిత్రను ఎలా తీస్తారంటూ మండిపడ్డారు. కేతిరెడ్డిలాంటి కొంత మంది పాపులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించడంతో, ఈ ప్రాంతమంతా అపవిత్రమైందని... పాలాభిషేకం చేయడం ద్వారా ఘాట్ ను శుద్ది చేశానని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు పూజలు చేసే ఈ ప్రాంతంలో ఇతరులెవరో పేర్లను తీసుకొచ్చి మాట్లాడటం దారుణమని అన్నారు.