jc diwakar reddy: ఓట్ల కోసం పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేస్తున్నాడు!: జగన్ పై విరుచుకుపడ్డ జేసీ దివాకర్ రెడ్డి
- జగన్ కు పోయే కాలం దగ్గర పడింది
- ప్రాంతాల మధ్య కూడా చిచ్చుపెడుతున్నారు
- పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేస్తున్నారు
వైసీపీ అధినేత జగన్ తో పాటు ఏపీ మంత్రులపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ కు పొద్దున్న లేచినప్పటి నుంచి చంద్రబాబును విమర్శించడమే పని అని మండిపడ్డారు. ఒక పార్టీకి నాయకుడిగా ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో తప్పు లేదని... ఇదే సమయంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కరవుసీమ రాయలసీమకు చంద్రబాబు నీరు ఇస్తుంటే... రాయలసీమకు నీరు ఎలా ఇస్తారని, పల్నాడుకు ఇవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పోయే కాలం దగ్గరపడిందని అన్నారు. పల్నాడుకు నీరు కావాలనే స్లోగన్ ను అంబటి రాంబాబు ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఇది అత్యంత దారుణమని... సీమకు నీళ్లివ్వకుండా, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఇంకా దోచి పెట్టాలా? అని నిలదీశారు. ఓట్ల కోసం పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేసేందుకు జగన్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. జగన్ దృష్టి అంతా సీఎం పదవి మీదే ఉందని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప నాయకుడని, పరిపాలనా దక్షుడని జేసీ కొనియాడారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అనేక విషయాల్లో చంద్రబాబుతో ఏకీభవించానని చెప్పారు. తినటానికి తిండి, తాగడానికి నీరు కూడా లేని అనంతపురం జిల్లాకు నీరు ఇస్తూ సస్యశ్యామలం చేశారని... దీనికి అనంతపురం జిల్లా ప్రజలంతా చంద్రబాబుకు రుణపడి ఉంటారని చెప్పారు.
ఇదే సమయంలో ఏపీ మంత్రులపై కూడా జేసీ విమర్శలు గుప్పించారు. వీరెవరికీ వెన్నెముక లేదని విమర్శించారు. మంత్రుల పవర్ అనేది తమ టైమ్ తోనే పోయిందని అన్నారు.