rahul gandhi: రాహుల్ ను 'పప్పు' అనడాన్ని నిషేధించిన ఈసీ!
- బీజేపీ ప్రచారంలో రాహుల్ ను 'పప్పు' అంటూ ప్రకటనలు
- ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- 'పప్పూ' అనడం అభ్యంతరకరమేనన్న ఈసీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ ను 'పప్పూ' అని బీజేపీ నేతలు సంబోధిస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనికి సాక్ష్యాలుగా బీజేపీ నేతల ప్రసంగాల స్క్రిప్టును కూడా పంపింది. ప్రసార మాధ్యమాలకు ఇచ్చిన ఓ ప్రకటనలో సైతం రాహుల్ ను 'పప్పు' అని బీజేపీ అభివర్ణించింది.
దీనిపై స్పందించిన ఈసీ, 'పప్పు' అన్న పదం అభ్యంతరకరమేనని తేల్చింది. ఓ నేతను అలా పిలవడం అవమానించడమేనని స్పష్టం చేస్తూ, ఆ పదాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. కాగా, దీనిపై స్పందించిన బీజేపీ, తాము వాడిన 'పప్పు' అన్న పదం ఏ నేతనూ ఉద్దేశించినది కాదని వెల్లడించింది. ప్రచార కార్యక్రమాల స్క్రిప్టును ఈసీ నేతృత్వంలోని మీడియా కమిటీకి పంపించి, వారి పరిశీలన అనంతరం వాడుతామని, 'పప్పు' పదం తొలగిస్తూ, సరికొత్త స్క్రిప్టును తయారు చేసి మరోసారి పరిశీలనకు పంపుతామని పేర్కొంది.