Chandrababu: జగన్ విసిరిన సవాల్ ను చంద్రబాబు స్వీకరించాలి: వైయస్ అవినాష్
- సవాల్ స్వీకరిస్తే సీఎం పదవి పోతుందని భయపడుతున్నారు
- జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
- కడప జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు
ప్యారడైజ్ పేపర్లలో వైసీపీ అధినేత జగన్ పేరు కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు జగన్ ను తూర్పారబట్టారు. ఈ నేపథ్యంలో కడప వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యారడైజ్ పత్రాల వ్యవహారంతో జగన్ కు సంబంధం లేకపోయినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. విదేశాలకు నల్లధనాన్ని తరలించారనే ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని... నిరూపించలేకపోతే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలంటూ జగన్ విసిరిన సవాల్ ను చంద్రబాబు ఇంతవరకు స్వీకరించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు.
ప్యారడైజ్ పత్రాల వ్యవహారంలో నిజాలు లేవు కాబట్టే చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని... నిరూపించలేకపోతే పదవిని పోగొట్టుకోవాల్సి వస్తుందనే భయం ఆయనలో ఉందని అవినాష్ అన్నారు. జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కడప జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేసిన ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఇన్ ఛార్జులు, సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.