baahubali 2: 'బాహుబలి 2' చిత్రంలో దాదాపు 450 తప్పులు... కనిపెట్టిన ఓ యూట్యూబర్
- నిజమే అనిపిస్తున్న కొన్ని తప్పులు
- ప్రఖ్యాత సినిమాల్లో తప్పులు చూపించడమే వీరి ధ్యేయం
- వీరి వీడియోలకు లక్షల సంఖ్యలో వీక్షణలు
'బాహుబలి 2' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమను గర్వపడేలా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో దాదాపు 450 వరకు సిల్లీ తప్పులు ఉన్నాయని మీకు తెలుసా అవును... 'బాలీవుడ్సిన్స్' అనే ఓ యూట్యూబ్ ఛానల్ వారు బాహుబలి 2 చిత్రంలోని దాదాపు 450 తప్పులను చూపిస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశారు.
తల మీద అగ్ని కుండను మోసిన శివగామికి చెమట పట్టకపోవడం, జూనియర్ ఆర్టిస్టుల ఓవర్యాక్షన్, దండలు మాయమవడం, గాయాలు లేకపోవడం వంటి చాలా తప్పులను ఈ వీడియోలో చూపించారు. అయితే ఇందులో కొన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టుగా తప్పుల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. అయినప్పటికీ కొన్ని తప్పులు మాత్రం నమ్మశక్యంగానే ఉన్నాయి.
గత మూడేళ్లుగా ఈ యూట్యూబ్ ఛానల్ వారు ప్రఖ్యాత సినిమాల్లో ఉన్న తప్పులను చూపిస్తూ వీడియోలు పెడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 28 సినిమాల్లోని తప్పులను వీరు చూపించారు. వీటిలో దంగల్, దిల్వాలే, పీకే వంటి సినిమాలున్నాయి. 'బాహుబలి' మొదటి చిత్రంలో కూడా వీరు 145 తప్పులను కనిపెట్టారు. వీరి వీడియోలన్నింటికీ లక్షల సంఖ్యలో వీక్షణలు వస్తున్నాయి. సినిమాను చూసేవారు ఇవన్నీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తారు. కానీ తర్వాత ఇలాంటి తప్పుల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.