2018 football: ఇటలీకి ఘోర అవమానం... 60 ఏళ్ల తరువాత మాజీ చాంప్ లేకుండా సాకర్ సమరం!
- క్వాలిఫయింగ్ పోటీలో సత్తా చాటలేక పోయిన ఇటలీ
- బలహీన స్వీడన్ తో మ్యాచ్ డ్రా
- 1952 తరువాత ఇటలీ లేకుండా ప్రపంచకప్
- క్షమించమని వేడుకున్న సీనియర్ ఆటగాడు బఫాన్
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఇటలీ స్థానమేంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాలుగు సార్లు చాంపియన్. రెండుసార్లు రన్నరప్... ఫుట్ బాల్ పేరు చెబితే పులకించి కేరింతలు కొట్టే కోట్లాది మంది ఇటలీ అభిమానులకు ఘోర అవమానం ఎదురైంది. 1952 తరువాత, ప్రతి సారీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచి సత్తా చాటిన ఇటలీ, 2018 సాకర్ సమరానికి అర్హత సాధించలేకపోయింది.
1934, 1938, 1982, 2006 సంవత్సరాల్లో సాకర్ వరల్డ్ కప్ ను గెలుచుకున్న ఇటలీ, 2018 అర్హత పోటీల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచి తన అవకాశాలను జారవిడుచుకుంది. స్వీడన్ తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ తో 2-0 తేడాతో గెలిస్తే, వరల్డ్ కప్ కు అర్హత పొందే స్థితిలో ఉన్న ఇటలీ, ఆ మ్యాచ్ ని డ్రాతో ముగించి తమ దేశాభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఐరోపా గ్రూప్ లో క్వాలిఫయర్స్ పోటీల్లో అంచనాలకు తగ్గట్టు ఇటలీ ఆడలేకపోయిందని అభిమానులు వాపోయారు.
అయితే, ప్రత్యర్థి స్వీడన్ కావడంతో సునాయాసంగా గెలిచి తాము ప్లే ఆఫ్ కు వెళతామని అభిమానులు తొలుత భావించారు. ఈ మ్యాచ్ లో తమకు లభించిన గోల్ అవకాశాలను కూడా ఇటలీ అందుకోలేకపోయింది. పోటీ అనంతరం ఇటలీ గోల్ కీపర్ బఫాన్ కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఏడుస్తూ, తమను క్షమించాలని అభిమానులను వేడుకున్నాడు. ఇక ఇటలీ అంతా నిరాశలో కూరుకుపోగా, జట్టు ఆటతీరుపై మీడియా దుమ్మెత్తి పోసింది.