deepika padukone: ఇండియా వెనుకబడిపోయిందన్న దీపికా పదుకొనే... దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
- జాతిని అవమానిస్తావా? అంటూ ఆగ్రహం
- నీకు డబ్బులు వెనుకబడిన దేశం నుంచి వస్తున్నాయా?
- 'పద్మావతి' పేరు పెట్టుకోకుండా డ్యాన్సులు చేసుకోవాల్సింది
- దీపికపై విమర్శల జడివాన
తాను హీరోయిన్ గా నటించిన 'పద్మావతి' చిత్రంపై నెలకొన్న వివాదాలను ప్రస్తావిస్తూ, దీపికా పదుకొనే నోరు జారి, మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి టార్గెట్ అయింది. "ఒక దేశంగా మనం ఎక్కడికి వెళుతున్నాం. మనం వెనుకబడిపోయాం. మేము సమాధానం చెప్పాల్సింది ఒక్క సెన్సార్ బోర్డుకు మాత్రమే" అని దీపిక వ్యాఖ్యానించింది. ఆ వెంటనే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీపిక జాతి మొత్తాన్ని అవమానించిందని ఎంతో మంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "కేవలం దీపిక తన సినిమా కోసమే దేశం వెనుకబడి పోయిందని చెబుతోంది. ఎంత అహంకారం? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పు" అని ఒకరు, "పద్మావతి అన్న పేరు పెట్టుకోకుండా దీపిక డ్యాన్సులు చేసుకుని ఉండాల్సింది" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇక దీపిక వ్యాఖ్యలపై 'రాజ్ పుటానా' ట్విట్టర్ ఖాతాలో బెదిరింపు ట్వీట్లు వచ్చాయి. "పద్మావతి విడుదలను ఎవరూ అడ్డుకోలేరని భావిస్తే, మా తుపాకుల నుంచి వచ్చే తూటాలనూ ఎవరూ అడ్డుకోలేరు" అని హెచ్చరికలు కనిపిస్తున్నాయి.