jc diwakar reddy: వైయస్ పేరు చెప్పుకునే రోజులు పోయాయి.. రకుల్ ప్రీత్ వచ్చినా జనం ఎగబడతారు: జేసీ
- జగన్ వల్ల రెడ్లకు విలువలేకుండా పోయింది
- ఇతర కులాలవారు రెడ్లను గౌరవించడం మానేశారు
- రోజా సభకు కూడా జనాలు వస్తారు
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వృథా ప్రయాసే అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వైయస్ పాదయాత్ర చేసినప్పటి పరిస్థితి వేరని... ఇప్పటి పరిస్థితులు వేరని చెప్పారు. జగన్ కారణంగా రెడ్లకు విలువే లేకుండా పోయిందని తెలిపారు. రెడ్డి కులస్తులంతా జగన్ వెంటే వెళ్తుండటంతో... ఇతర కులాలకు చెందినవారు రెడ్లను గౌరవించడం మానేశారని చెప్పారు. రెడ్ల తోకలను కరణం బలరాంలాంటి వాళ్లు కోసేశారని అన్నారు. వైయస్ గురించి చెప్పుకునే రోజులు పోయాయని జేసీ స్పష్టం చేశారు.
జగన్ పాదయాత్రకు జనాలు వస్తున్నారన్న విషయంపై స్పందిస్తూ, చిరంజీవి, పవన్ కల్యాణ్ సభలకూ జనాలు వచ్చారని, రోజా పెట్టినా వస్తారని, రకుల్ ప్రీత్ సింగ్ వస్తే జనాలు ఎగబడతారని జేసీ అన్నారు. రాజకీయాలు ఇకపై తనకు అనవసరమని, 2019లో రిటైర్ అవుతానని చెప్పారు. జగన్ కూడా రాజకీయాలు వదిలేసి, మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని సూచించారు.