pappu: 'పప్పు'ను నిషేధించిన ఈసీ... వెంటనే రాహుల్ కోసం బీజేపీ కనిపెట్టిన కొత్త పేరు!
- 'పప్పు' స్థానంలో 'యువరాజ్'
- ప్రచార ప్రకటనలు విడుదల చేసిన గుజరాత్ బీజేపీ
- వచ్చే నెలలో రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు
త్వరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు'గా సంబోధిస్తూ, బీజేపీ ప్రకటనలు విడుదల చేయడాన్ని తప్పుబట్టిన ఎన్నికల కమిషన్ ఆ పదాన్ని నిషేధించిన నేపథ్యంలో, వెంటనే బీజేపీ శ్రేణులు కొత్త పదాన్ని వాడటం ప్రారంభించాయి. తాజాగా బీజేపీ జారీ చేసిన ఎన్నికల ప్రకటనల్లో 'పప్పు' స్థానంలో 'యువరాజ్' అని కనిపిస్తోంది.
ప్రస్తుతం గుజరాత్ బీజేపీ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పెడుతున్న వీడియోల్లో రాహుల్ గాంధీని 'యువరాజ్' అని సంబోధిస్తున్నాయి. 48 సెకన్ల వీడియోలో, దుకాణదారుని వద్దకు వచ్చిన ఓ గొంతు 'సార్ సార్' అని పిలువగా, దుకాణదారు అసిస్టెంట్ 'యువరాజ్ వచ్చారు' అంటాడు. దీంతో దుకాణదారు యువరాజ్ ను ఉద్దేశించి, 'నువ్వు ఏమైనా కొనచ్చుగానీ, మా ఓట్లను మాత్రం కొనలేవు' అనడం వినిపిస్తోంది. ఇటువంటి లఘు వీడియోలు ఎన్నో ఇప్పుడు గుజరాత్ లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, గుజరాత్ లో డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.