plantix: అద్భుతం చూపిస్తున్న 'ప్లాన్ టిక్స్'... మొక్క ఫొటో తీస్తే చీడపీడలు, నివారణ వివరించే సరికొత్త యాప్!

  • అందుబాటులోకి వచ్చిన సరికొత్త యాప్
  • 35 పంటలకు సంబంధించిన 176 చీడపీడల వివరాలు
  • నెల రోజుల్లో 52 వేల డౌన్ లోడ్స్ సాధించిన యాప్
  • తెలుగులోనూ అందుబాటులో సమాచారం

అందివచ్చిన అధునాతన సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న వేళ, రైతులందరితో పాటు, ఇళ్లలో మొక్కలు పెంచుకునేవారికి సైతం ఉపయుక్తకరంగా ఉండేలా తయారు చేసిన ఓ అద్భుతమైన యాప్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నంలో జరుగుతున్న అగ్రీటెక్స్-2017 సదస్సులో 'ప్లాన్ టిక్స్' (plantix) పేరిట తయారైన ఈ యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక్రిశాట్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ఓ జర్మనీ సంస్థతో కలిసి ఈ యాప్ ను రూపొందించారు. తెలుగు భాషలో కూడా సమాచారాన్ని ఇచ్చే యాప్ ను వాడుతూ, ఓ మొక్క ఫొటో తీస్తే, దానికి పట్టిన చీడపీడలు, నివారణ మార్గాలు, ఆపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి క్షణాల్లో వివరించడం దీని ప్రత్యేకత. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి 35 పంటలకు సంబంధించిన 176 చీడపీడల వివరాలు ఇందులో నిక్షిప్తమై ఉంటాయని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

 ఈ యాప్ ను ఇటీవల చంద్రబాబు పరిచయం చేశారని, ఆపై నెల రోజుల వ్యవధిలో 52 వేల డౌన్ లోడ్స్ జరిగాయని, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా 'ప్లాన్ టిక్స్'ను వాడుతున్నారని వివరించారు. పంటలకు సోకిన చీడపీడల వివరాలు, పోషకాల్లో లోపాలను తెలిపేలా ఓ డ్రోన్ ను సైతం తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News