forbes: ఆసియాలో అత్యంత ధనిక కుటుంబంగా ముకేష్ అంబానీ కుటుంబం!
- ఫోర్బ్స్ ఆసియా టాప్ 50 ధనిక కుటుంబాల జాబితాలో మొదటి స్థానం
- 44.8 బిలియన్ డాలర్ల సంపాదన
- రెండో స్థానంలో శాంసంగ్ అధినేత లీ కుటుంబం
ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా విడుదల చేసిన ఆసియాలోని టాప్ 50 ధనిక కుటుంబాల జాబితాలో ముకేశ్ అంబానీ కుటుంబం మొదటిస్థానంలో నిలిచింది. 44.8 బిలియన్ డాలర్ల సంపాదనతో ముకేశ్ అంబానీ కుటుంబం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో రెండో స్థానంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ అధినేత లీ కుటుంబం ఉంది. వీరి సంపాదన 40.8 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. ఇంకా మూడో స్థానంలో హాంకాంగ్‌కి చెందిన క్వాక్ కుటుంబం (సున్ హంగ్ కై ప్రాపర్టీస్), నాలుగో స్థానంలో థాయ్‌లాండ్‌కి చెందిన చియరావనంట్ కుటుంబం (షారియన్ పోక్ఫండ్ గ్రూప్) నిలిచాయి.
టాప్ 10లో స్థానం దక్కించుకున్న ఏకైక భారత కుటుంబంగా అంబానీ కుటుంబం నిలిచింది. ఈ జాబితా మొత్తం 18 భారతీయ ధనిక కుటుంబాలు ఉన్నాయి. ప్రేమ్‌జీ కుటుంబం (11వ స్థానం), హిందుజ కుటుంబం (12), మిట్టల్ కుటుంబం (14), మిస్త్రీ కుటుంబం (16) ఉన్నాయి. అలాగే గోద్రెజ్, బజాజ్, జిందాల్, బర్మన్, లాల్, బంగూర్ కుటుంబాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.