twitter: 'బ్లూ టిక్'పై ట్విట్టర్ తాజా హెచ్చరికలివి!
- త్వరలోనే కొత్త మార్గదర్శకాలు
- నిబంధనలు పాటించకుంటే 'బ్లూ టిక్' తొలగింపు
- ఓ ప్రకటనలో వెల్లడించిన ట్విట్టర్
తమ వెరిఫికేషన్ వ్యవస్థను సమీక్షిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, తాజాగా 'బ్లూ టిక్'పై మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ఖాతాల పేరు పక్కన కనిపించే ఈ నీలిరంగు టిక్ ను తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన సంస్థ, కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని తెలిపింది. కొత్త విధానంలో వెరిఫికేషన్ ఉంటుందని, రివ్యూ తరువాత నూతన విధానాన్ని అమలు చేస్తామని పేర్కొంది.
కొత్త మార్గదర్శకాలను ప్రతి ఖాతాదారూ పాటించాల్సిందేనని, అలా చేయకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజే ట్విట్టర్ ఖాతాకు వెరిఫైడ్ చెక్ మార్క్ 'బ్లూ టిక్'ను ట్విట్టర్ తొలగించిన సంగతి విదితమే. ఆగస్టులో వర్జీనియాపై దాడికి తెగబడిన ఉగ్రవాది చార్లెట్స్ విల్లే ఖాతాకు కూడా ఇదే మార్క్ ఉండటంతో ట్విట్టర్ వెరిఫికేషన్ విధానంపై విమర్శలు వెల్లువెత్తగా, సంస్థ కొత్త మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమైంది.