delhi: కీలక సంస్కరణల దిశగా కేజ్రీవాల్ అడుగులు.. సేవల విప్లవం!
- కీలక పాలనా సంస్కరణల అమలు దిశగా కేజ్రీవాల్ సర్కార్
- ప్రభుత్వ సేవల కోసం కాళ్లరిగేలా తిరగక్కరలేదు
- రేషన్ కార్డు, ఆధార్, ఓటర్ ఐడీ.. అన్నీ ఇంటికే వచ్చి ఇస్తారు
రేషన్ కార్డు, కులధ్రువీకరణ పత్రాలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్.. ఇలా ఏ పత్రాలు కావాలన్నా అధికారగణం చుట్టూ కాళ్లరిగేలా తిరిగాల్సిన అవసరం ఢిల్లీ వాసులకు తప్పుతోంది. కీలక పాలనా సంస్కరణలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కారు నాంది పలకనుంది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, ఇకపై రేషన్ కార్డు, ఆధార్, ఓటర్ ఐడీ, కుల ధ్రువీకరణ పత్రం ఇలా ఏ సర్టిఫికేట్ కావాలన్నా రోజులు, నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. అధికారులే మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఇస్తారని చెప్పారు.
ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి కీలక పాలన సంస్కరణలపై నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఏదైనా సర్టిఫికేట్ అవసరమైతే అధికారులు వారి ఇంటికే వెళ్లి అందజేస్తారన్నారు. ఇందుకోసం అవసరమైతే కొంత రుసుం తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ సేవల కోసం పెద్ద పెద్ద వరుసల్లో నిలబడే బాధల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
ఇందుకోసం అధికారులు లేదా మొబైల్ సహాయక్ లను ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం తీసుకోనుందని ఆయన చెప్పారు. మొదటి దశలో భాగంగా 40 రకాల ప్రభుత్వ సేవలను ఇంటికే అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించారు. కాలక్రమేణా మరిన్ని సర్వీసులను ప్రజలకు అందేలా చూస్తామని ఆయన తెలిపారు. దీంతో సేవల విప్లవం మొదలుకానుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.