Virat Kohli: రికార్డుల వీరుడి ఖాతాలో చెత్త రికార్డు.. కపిల్ చెంతన కోహ్లీ!
- ఏడాదిలో ఐదుసార్లు డకౌట్
- ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై తొలి డక్
- కోల్‌కతా టెస్టులో లక్మల్‌కు వికెట్ సమర్పించుకున్న కోహ్లీ
రికార్డులను అలవోకగా తన ఖాతాలో వేసుకుంటున్న టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈసారి ఓ చెత్త రికార్డును సమం చేశాడు. శ్రీలంకతో కోల్‌కతాలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డకౌట్ అయిన కోహ్లీ ఒక ఏడాదిలో అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది ఇలా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం ఇది ఐదోసారి. 1983లో కపిల్ దేవ్ కూడా ఇలాగే ఏడాదిలో ఐదుసార్లు డకౌట్ అయ్యాడు. ఇప్పుడీ రికార్డును కోహ్లీ సమం చేశాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో పుణెలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ తొలిసారి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి, సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన వన్డేలో మూడోసారి, గువాహటిలో జరిగిన టీ20లో నాలుగోసారి కోహ్లీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. తాజాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లక్మల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.