TTD: తిరుమల వెంకన్న సర్వదర్శనంలో సమూలమార్పు... సామాన్య భక్తులకు శుభవార్త!
- సామాన్య భక్తులకూ టైం స్లాట్
- డిసెంబర్ రెండో వారంలో ప్రయోగాత్మక పరిశీలన
- తిరుమలలో 21 ప్రాంతాల్లో 150 కౌంటర్లు
- రెండు గంటల్లోనే దర్శనం
లిప్తపాటుకాలం ఆ దేవదేవుని దర్శించుకుందామని భావించి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు వెళ్లే సామాన్య భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. క్యూలైన్ కంపార్టుమెంట్లలో గంటల తరబడి, ఒక్కోసారి రోజుకుపైగా వేచివుండే బాధను తప్పిస్తూ, టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు కూడా రెండు గంటల్లోనే స్వామి దర్శనం చేయించేలా టైమ్ స్లాట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని డిసెంబర్ రెండోవారంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
తిరుమలలో రద్దీ లేని వేళల్లో సైతం సామాన్య భక్తులు నాలుగైదు గంటలు వేచి చూస్తుండాల్సి వస్తోంది. ఇక సామాన్యులకు పెద్దపీట వేయాలని భావిస్తున్న టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఈ నూతన టైమ్ స్లాట్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుమలలో 21 ప్రాంతాల్లో 150 టైం స్లాట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి వద్దకు వెళ్లిన భక్తులకు, ఏ సమయానికి క్యూలైన్ లోకి వెళ్లాలన్న విషయాన్ని నిర్దేశిస్తూ, కూపన్ ఇస్తారు. దీన్ని తీసుకుని లోపలికి వెళితే, రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. ఇదే సమయంలో సాధారణ పద్ధతిలోనూ కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతిస్తామని, వారికి ఇప్పుడున్న పద్ధతిలోనే దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.