TTD: తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్... ఈ సవాళ్లను దాటేదెలా?
- డిసెంబర్ రెండో వారం నుంచి టైం స్లాట్
- రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం
- భక్తులు పదేపదే దర్శనానికి వచ్చే అవకాశం
- లడ్డూల బ్లాక్ మార్కెటింగ్ పెరిగే అవకాశం
వచ్చే నెల రెండో వారం నుంచి తిరుమలకు వెళ్లే సాధారణ భక్తులకూ టైం స్లాట్ విధానాన్ని అమలు చేయాలన్న టీటీడీ నిర్ణయం బాగానే ఉన్నా, ఈ విధానంలో ఎదురయ్యే సవాళ్లను టీటీడీ ఎలా అధిగమిస్తుందన్న సందేహాలు వస్తున్నాయి. తిరుమలలో దళారుల బెడద చాలా అధికమన్న సంగతి అందరికీ తెలిసిందే. సరైన నిఘా వ్యవస్థ లేకుంటే ఈ విధానాన్ని దళారులు తమకు సంపాదన తెచ్చిపెట్టేలా మార్చుకుంటారనడంలో సందేహం లేదు.
ఇక మరో అతిపెద్ద సవాలు ఏంటంటే, తిరుమల వెంకన్నను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదన్న సంగతి తెలిసిందే. ఇక రెండు గంటల్లోనే దర్శనం ముగుస్తుంది కాబట్టి, భక్తులు మళ్లీ మళ్లీ దర్శనానికి వెళ్లాలని భావించవచ్చు. దీని ద్వారా రద్దీ మరింతగా పెరుగుతుంది. ఇక మరో సమస్య లడ్డూల బ్లాక్ మార్కెటింగ్. ప్రస్తుతం సాధారణ భక్తులకు రూ. 10 లడ్డూలు రెండు, రూ. 25 లడ్డూలు రెండు ఇస్తున్నారు. అంటే, రూ. 70కి నాలుగు లడ్డూలు వస్తాయి. ఇక రెండు గంటల్లో నాలుగు లడ్డూలు లభిస్తే, తిరుమలలోనే తిష్ట వేసుకుని ఉండే దళారులకు పండగే. వారు ఇలా దర్శనానికి వెళ్లి, అలా నాలుగేసి చొప్పున లడ్డూలు తెచ్చి అక్రమ అమ్మకాలు సాగించే చాన్స్ ఉంది.
ఒక భక్తుడు పదే పదే రాకుండా నిరోధించే సాంకేతిక వ్యవస్థను... అంటే ఆధార్ ఆధారిత దర్శనం అమలు చేస్తే, భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక ఇటువంటి సవాళ్లను అధిగమించి, దళారుల బెడద లేకుండా చేస్తేనే ఈ కొత్త టైం స్లాట్ విధానం విజయవంతం అవుతుందని చెప్పచ్చు!