vote: నా భార్యకు ఓటు వేయండి.. లేకపోతే కష్టాల పాలవుతారు... ముస్లింలను బెదిరించిన బీజేపీ నాయకుడు
- స్థానిక ఎన్నికల్లో భార్య తరఫున ప్రచారం చేసిన యూపీ బీజేపీ కౌన్సిలర్
- సభలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు
- వారి సమక్షంలోనే హెచ్చరికలు చేసిన రంజిత్ కుమార్ శ్రీవాత్సవ
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బీజేపీ నాయకుడు ఓట్ల పేరుతో ముస్లింలను బెదిరించాడు. తన భార్య శశి శ్రీవాత్సవ తరఫున ప్రచారం చేస్తూ బీజేపీ కౌన్సిలర్ రంజిత్ కుమార్ శ్రీవాత్సవ ఆమెకు ఓటు వేయకపోతే ముస్లింలు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇదే సభలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు దారా సింగ్ చౌహాన్, రమాపతి శాస్త్రిలు ఉండటం గమనార్హం. వారి ముందే రంజిత్ కుమార్ బెదిరింపు వ్యాఖ్యలు చేయడం వీడియోలో రికార్డయినట్లు తెలుస్తోంది.
'ఇది సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీ నాయకులెవరూ మీకు సహాయం చేయలేరు. రోడ్లు, నాలాల మరమ్మత్తుతో పాటు ఇంకా చాలా పనులు స్థానిక సంస్థల చేతిలోనే ఉంటాయి. ఇక్కడ బీజేపీకి ఎదురేలేదు. అందుకే వారి విజయంలో మరింత సహాయం చేయండి. మీరు రంజిత్ కుమార్ భార్యకు ఓటు వేయకపోతే, ఎదుర్కోబోయే కష్టాల నుంచి సమాజ్వాదీ పార్టీ కూడా మిమ్మల్ని కాపాడలేదు. అందుకే ముస్లింలు అందరికీ ఇదే నేను చెబుతున్నా... మాకు ఓటు వేయండి. నేను ఓట్లు అడగడం లేదు..ఒకవేళ ఓటు వేస్తే ప్రశాంతంగా ఉంటారు, లేదంటే కష్టాల పాలవుతారు' అని రంజిత్ కుమార్ అన్నాడు.