susundeep kishan: ఆ పాప బతకలేదని తెలిసి చాలా బాధపడ్డాను: సందీప్ కిషన్
- ఎదుటివారికి సాయం చేయాలని ఉంటుంది
- ప్రత్యక్షంగా సాయం చేయడానికి ఇష్టపడతాను
- ఇటీవల సినిమాకి వెళితే ఓ తల్లి నన్ను పలకరించింది
- ఆమె చెప్పిన మాట నా కెంతో బాధ కలిగించింది
తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మంచి నటుడిగా .. మంచి మనిషిగా నా ప్రయాణం కొనసాగాలనే నేను భావిస్తూ వుంటాను. అందుకే నేను ఏ ఈవెంట్స్ చేసినా .. వచ్చిన డబ్బును ఇతరుల సాయానికే ఉపయోగిస్తూ వుంటాను. ట్రస్టుల ద్వారా కాకుండా .. అప్పటికప్పుడు ఎవరికి అత్యవసరమో వాళ్లకి ప్రత్యక్షంగా సాయాన్ని అందించడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను" అన్నాడు.
" మొన్నీ మధ్య నేను 'సుప్రీమ్' సినిమాకి వెళ్లినప్పుడు, ఒకావిడ ఓ అమ్మాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నన్ను గుర్తుపట్టలేదా? అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది .. కొంతకాలం క్రితం ఆమె బిడ్డకి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడానికి 14 లక్షలు అవసరమయ్యాయి. ఓ ఈవెంట్ ద్వారా నాకు 4 లక్షలు వస్తే .. అవి సాయంగా ఇచ్చేశాను.
ఈ విషయం సమంతకి తెలిసి తన ఫౌండేషన్ ద్వారా మిగతా ఎమౌంట్ ను ఏర్పాటు చేసి .. ఆ పాపకి ఆపరేషన్ చేయించింది. ఆ విషయం గుర్తొచ్చి .. ఆ పాప .. ఈ అమ్మాయేనా? అంటూ నా ఎదురుగా వున్న తల్లిని అడిగాను. "ఆపరేషన్ తరువాత ఆ పాప చనిపోయింది .. ఈ అమ్మాయి మా రెండవ పాప" అని చెప్పింది. ఆ మాట వినగానే నాకు చాలా బాధ కలిగింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.