hardik patel: హార్దిక్‌ను అప‌ఖ్యాతి పాలు చేసేందుకు సీడీలు త‌యారుచేస్తున్న బీజేపీ!: పటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి

  • ఆరోపిస్తున్న పటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి (పాస్‌)
  • మొత్తం 52 సీడీల‌ను బీజేపీ త‌యారు చేసింద‌ని వ్యాఖ్య‌
  • అందులో 22 సీడీలు హార్దిక్ గురించే

ఇటీవ‌ల పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌, ఓ అమ్మాయితో క‌లిసి హోట‌ల్ రూంలో సన్నిహితంగా ఉన్నట్లు వ‌చ్చిన వీడియోలు గుజ‌రాత్ రాజ‌కీయాల్లో కలకలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌ను అప్ర‌తిష్ట పాలు చేసేందుకే అధికార బీజేపీ ఇలాంటి వీడియోలు విడుద‌ల చేస్తోంద‌ని, అందులో ఉన్న‌ది తాను కాద‌ని హార్దిక్ స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ ఈ విష‌యంపై మిశ్ర‌మ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే ప్ర‌త్యేకంగా హార్దిక్‌ను, పార్టీని అప‌ఖ్యాతి పాలు చేసేందుకే బీజేపీ ఇలాంటి సీడీలు త‌యారుచేస్తోంద‌ని, త్వ‌ర‌లోనే ఇలాంటి వీడియోల‌ను మ‌రికొన్నింటిని విడుద‌ల చేయ‌నుంద‌ని పటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) ఆరోపించింది. ఈ విష‌యం గురించి తమ వ‌ద్ద స‌మాచారం ఉన్న‌ట్లు తెలిపింది.

‘బీజేపీ నేతలు మాపై మరిన్ని సీడీలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు 52 సీడీలు త‌యారుచేసినట్లు మాకు తెలిసింది. హార్దిక్‌పటేల్‌ను ఇరికిస్తూ 22, పాస్‌ నేతలను లక్ష్యంగా చేసుకొని 30 సీడీలను తయారు చేస్తున్నారు. ఈ నకిలీ సీడీలకు గుజరాత్‌ ముఖ్యమంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది.’ అని పటిదార్‌ గ్రూప్‌ కన్వీనర్‌ దినేశ్‌ బాంభానియా వెల్లడించారు.

మ‌రోవైపు ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. పాస్ వారే సీడీలను తయారుచేయించుకుని, బీజేపీ మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని గుజ‌రాత్ ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్ అన్నారు. రానున్న‌ అసెంబ్లీ ఎన్నికల్లో హార్దిక్‌ పటేల్ వ‌ర్గం పోటీ చేయ‌క‌పోతున్న‌ప్పటికీ, బీజేపీ అధికారంలోకి రాకుండా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News