telangana: ఇజ్రాయెల్ వెళ్లనున్న వెయ్యి మంది తెలంగాణ వ్యవసాయాధికారులు... కొత్త వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ!
- 3 నెలల పాటు కొనసాగనున్న పర్యటన
- పర్యటన ఖర్చు రూ. 25 నుంచి రూ. 30 కోట్లు
- ప్రజల సొమ్ము వృథా చేస్తున్నారన్న ప్రతిపక్షం
తెలంగాణలోని వ్యవసాయం, హార్టికల్చర్ శాఖలకు చెందిన దాదాపు 1000 మంది అధికారులను ఓ అధ్యయన యాత్ర నిమిత్తం ప్రభుత్వం ఇజ్రాయెల్ పంపించనుంది. వ్యవసాయంలో కొత్తపద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అధ్యయనం, శిక్షణ కోసం డిసెంబర్‌లో వీరిని తీసుకెళ్లనుంది. కనిష్టంగా 15 రోజులు, గరిష్టంగా 3 నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. దీని కోసం రూ. 25 నుంచి రూ. 30 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలాంటి పర్యటనల వల్ల ప్రజల సొమ్ము వృథా కావడం మినహా వేరే ప్రయోజనం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఆయా శాఖల్లోని ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి టెక్నికల్ స్టాఫ్ వరకు అందర్నీ తీసుకెళ్లనున్నారు. `ఇది హాలీడే ట్రిప్ కాదు... వ్యవసాయాధికారులు, ఉద్యోగుల ఆలోచనాశక్తిని విస్తృతపరిచే పర్యటన. ఇప్పటివరకు వారంతా పాత పద్ధతులు ఉపయోగిస్తూ కప్పల్లా పనిచేశారు. ఈ అధ్యయన యాత్ర తర్వాత వారి ధోరణిలో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది` అని తెలంగాణ అగ్రికల్చర్ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో చర్చించి, యాత్ర ప్రణాళిక సిద్ధం చేస్తామని, అక్కడి రైతులు కొన్ని పద్ధతుల ద్వారా అత్యధిక దిగుబడి సాధిస్తున్నారని, అందుకే అధ్యయనయాత్ర కోసం ఆ దేశాన్ని ఎంచుకున్నట్లు పార్థసారథి వివరించారు.