nandi awards: నంది అవార్డులపై వర్మ భారీ సెటైర్.. వ్యంగ్యంతో కూడిన వీడియో చూడండి!
- నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు
- నంది పాట పాడుతున్నట్లు వర్మ వ్యంగ్యంగా వీడియో
- 'అంకెలు చూస్తే తొమ్మిది, మా కోరిక మాత్రం కమ్మది' అంటూ పాట
- పాట నృత్యాన్ని చూపించి సెటైర్లు వేసిన క్రియేటివ్ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. పూర్తి వివక్షాపూరితంగా నంది అవార్డులను ప్రకటించారని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటారా?.. గతంలోనే నంది అవార్డులను 'గుర్రం' అవార్డులంటూ తాను సునీల్ హీరోగా తీసిన 'కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు' అనే సినిమాలో వర్మ హేళన చేశారు. అవి ఎందుకు ఇస్తారో ఎవరికీ ఇస్తారో ఏ టాలెంట్ చూసి ఇస్తున్నారో అంటూ ఇప్పటికీ వర్మ మండిపడుతున్నారు.
తాజాగా ఆయన నంది అవార్డులపై ఏకంగా ఒక పాటనే విడుదల చేశారు. 'ఒకటా.. రెండా.. తొమ్మిదీ..' అంటూ 'చాణక్య చంద్రగుప్త' సినిమాలోని పాట విజువల్స్ కు.. నంది అవార్డులపై వ్యంగ్యంగా రూపొందించిన పాటను జత చేసి పోస్ట్ చేశారు. 'ఇష్టమొచ్చినట్లు పంచుకోవడం మాకు ఇష్టం... మేము చెప్పినట్లు తల ఊపూ నందీ.. ఇంకెందుకు నందులు.. ఎందుకో?.. అంకెలు చూస్తే తొమ్మిది మా కోరిక మాత్రం కమ్మది' అంటూ నంది అవార్డులపై భారీ సెటైర్లు వేశారు వర్మ.
'గంగిరెద్దులాగ నన్ను చూడకండి.. అక్కడక్కడే తిప్పకండి' అంటూ 'నంది' పాట పాడుతుందని ఆయన వివరించారు. 'అడ్డు వచ్చేవారు లేరు మాకు, పచ్చ జెండా ఊపుతాము మేమూ' అంటూ విపరీతమైన కామెడీని ఈ పాటలో వినిపించారు.. మీరూ చూడండి...