Check Book: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇక 'చెక్'కు చెక్!
- అతి త్వరలో చెక్బుక్కు మంగళం
- డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యం
- ‘డిజిటల్ రథ్’ను ప్రారంభించిన సీఏఐటీ
కేంద్రం నుంచి అతి త్వరలో మరో సంచలన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేవాల్ తెలిపారు. దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచే ఉద్దేశంతో సమీప భవిష్యత్తులో చెక్‌బుక్ సదుపాయాన్ని రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబోతోందన్నారు. డిజిటల్ లావాదేవీల్లోని వివిధ పద్ధతులను వ్యాపారులకు పరిచయం చేసే ఉద్దేశంతో సీఏఐటీ, మాస్టర్‌కార్డ్ కలిసి ఏర్పాటు చేసిన ‘డిజిటల్ రథ్’ను ప్రారంభించిన అనంతరం ప్రవీణ్ ఖండేవాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కరెన్సీ ముద్రణకు కేంద్రం రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, వాటి భద్రత, రవాణా కోసం మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. డెబిట్ కార్డు లావాదేవీలపై 1 శాతం, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2 శాతం చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల డెబిట్ కార్డు వినియోగదారులుంటే అందులో ఐదుశాతం మంది మాత్రమే నగదు రహిత లావాదేవీలకు వాటిని ఉపయోగిస్తున్నారని, మిగతావారు డబ్బులు డ్రా చేసుకోవడానికి మాత్రమే తమ కార్డులను ఉపయోగిస్తున్నారని ఖండేవాల్ వివరించారు.