Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- ఈ ప్రయాణం చాలా ఇష్టమంటున్న సమంత
- బ్రేక్ తీసుకుంటున్న డా.రాజశేఖర్
- కూతురికి తల్లిగా నటిస్తున్న శ్రీదేవి
- నెలాఖరుకి 'రంగస్థలం' టాకీ పూర్తి
* 'ఈ సినిమా ప్రయాణం అంటే నాకెంతో ఇష్టం..' అంటోంది ప్రెట్టీ డాల్ సమంత. 'సినిమాలలో నేను చేయాలనుకున్న పాత్రలు వాటికవే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అందుకేనేమో, సినిమాలపై ప్రేమ మరింత ఎక్కువై ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనిపిస్తుంది. నటన పరంగా ఇదంతా ఓ చాప్టర్. ఇకపై నటించేది మరో చాప్టర్. ఇంకా మంచి మంచి పాత్రలు వస్తాయని అనుకుంటున్నాను' అని చెప్పింది.
* ఇటీవల విడుదలైన 'గరుడ వేగా' చిత్రంతో మంచి విజయాన్ని సాధించి మళ్లీ సక్సెస్ బాట పట్టిన డా.రాజశేఖర్ తన తదుపరి చిత్రం విషయంలో కంగారుపడడం లేదు. అందుకే, ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదట. కథలు వింటున్నప్పటికీ ఎవరికీ ఓకే చెప్పలేదు. ముందు కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటానని, ఆ తర్వాత తదుపరి చిత్రాన్ని చేస్తానని రాజశేఖర్ చెబుతున్నారు.
* నాటి అందాలతార శ్రీదేవి తనయ జాహ్నవి 'ధడక్' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు, కూతురికి తల్లిగా సినిమాలో ఆమె కనిపించనున్నట్టు సమాచారం.
* రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రం టాకీ పార్ట్ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. దీంతో వచ్చే నెలలో పాటల చిత్రీకరణ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన సమంత నాయికగా నటిస్తోంది.