kancha ilaiah: ఎంవీఆర్ శాస్త్రి రాసిన 'ఐలయ్య పైత్యం' పుస్తకంపై కంచ ఐలయ్య ఆగ్రహం!
- ఐలయ్యను విమర్శిస్తూ పుస్తకం రాసిన ఎంవీఆర్ శాస్త్రి
- శాస్త్రిపై విమర్శలు గుప్పించిన ఐలయ్య
- ఏనాడైనా జనాల మధ్యకు వెళ్లి ఎడిటోరియల్ రాశారా? అంటూ ప్రశ్న
తనపై రాసిన 'ఐలయ్య పైత్యం' పుస్తకంపై కంచ ఐలయ్య మండిపడ్డారు. ఈ పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను క్రైస్తవుడిగా భావించడం పొరపాటని అన్నారు. బ్రాహ్మణ కులస్తులే క్రైస్తవ స్కూళ్లలో ఎక్కువగా చదువుకున్నారని విమర్శించారు.
మరోవైపు, కంచ ఐలయ్య రాసింది పరిశోధక పుస్తకం కాదని... పైత్యంతో రాసిన పుస్తకమని శాస్త్రి విమర్శించారు. ఐలయ్య రచించిన 'హిందూ మతానంతరం భారతదేశం', 'నేను హిందువు నెట్లయిత' పుస్తకాలను తన పుస్తకంలో శాస్త్రి ఉటంకించారు. హిందూ మతంపై అవగాహన లేని రాతలు ఐలయ్యవి అని విమర్శించారు. ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని చెప్పారు.
హిందువులను కించపరిచేలా ఐలయ్య రచనలు చేస్తున్నారని... హిందువుల నాశనాన్ని ఆయన కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. 'విష్ణువుకు, బ్రహ్మకు మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి ఐలయ్య' అంటూ మండిపడ్డారు. ఐలయ్య మేధావి కాదని... ఆయన వెనుక దేశాన్ని క్రైస్తవీకరణ చేయాలన్న కుట్ర ఉందని ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనేది ఐలయ్య ధ్యేయమని అన్నారు. హిందూ మతం నాశనాన్ని కోరుకునేవారు అన్యమతస్తులే అవుతారని శాస్త్రి అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఐలయ్య నేడు మండిపడ్డారు. తమ పెద్దలు గొర్రెలు కాసేవారని... శాస్త్రి అంటే శాస్త్రాలు చదుకున్నవాడు అని అర్థం అని చెప్పారు. ప్రపంచంలో మొదట పుట్టింది బౌద్ధమని, ఆ తర్వాత క్రిస్టియానిటీ, ఇస్లాం తదితర మతాలు వచ్చాయని... హిందూ మతాన్ని సనాతన ధర్మంగా చెబుతున్నారని తెలిపారు. రాజారామ్మోహన్ రాయే దానికి హిందూ మతం అని పేరు పెట్టారని చెప్పారు.
ఈ దేశానికి పునాదులు వేసింది అరబ్బులు అని... వారి గురించి వీరి శాస్త్రాల్లో ఎక్కడైనా పేర్కొన్నారా? అని ప్రశ్నించారు. ఈ దేశాన్ని మలుపులు తిప్పింది శ్రీకృష్ణుడని... ఆయనొక పశువుల కాపరి అని చెప్పారు. అనంతరం ఆదివాసులలో పుట్టిన గౌతమ బుద్ధుడు దేశాన్ని మార్చారని తెలిపారు. పశుశక్తిని నాగలి దున్నడానికి మొదట ప్రయత్నించింది బుద్ధుడి కాలంలోనే అని చెప్పారు. ఆ తర్వాత అంబేద్కర్ దేశాన్ని మార్చారని... ఇప్పుడు కంచ ఐలయ్య ఏదేదో రాస్తున్నాడని విమర్శిస్తున్నారని తెలిపారు.
శాస్త్రి గారిని తాను ఒకటే అడుగుతున్నానని... ఆయన జీవిత కాలంలో ఏనాడైనా కులవృత్తులు చేసుకునే వారి మధ్యకు వెళ్లి, ఎడిటోరియల్ రాశారా? అని ప్రశ్నించారు. శాస్త్రిగారి బంధువులు క్రైస్తవ భాష అయిన ఇంగ్లిష్ లో ఎందుకు చదువుకుంటున్నారని అన్నారు. తిరుమలలో అన్ని కులాల వారికి అర్చకత్వ బాధ్యతలను అప్పగిస్తే అంటరానితనం పోతుందని... ఇది ఎందుకు చేయడం లేదని... హిందూ మతంలోని ఇతర కులస్తులను ఎందుకు దూరం పెడుతున్నారని ప్రశ్నించారు.
దేవుడు అందరినీ సమానంగా సృష్టించారని మీరు నమ్ముతున్నారా? అని అడిగారు. ఇంగ్లిష్ చదువుకున్న అగ్రకులస్తులంతా తమ పేర్ల వెనుక పాస్టర్లు అని పెట్టుకోవాలని సూచించారు. తన తల్లిదండ్రులు గొర్రెల కాపర్లు కావడంతో తాను 'షెపర్డ్' అని పేరు పెట్టుకున్నానని చెప్పారు. ఉత్పత్తి కులాల కోసం రచనలు చేస్తున్నవారిని పిచ్చోళ్లు అంటున్నారని విమర్శించారు. తాము దేశ పునాదులను మార్చాలనుకుంటున్నామని... తిట్టుకు తిట్టు ఎప్పటికీ సమాధానం కాదని చెప్పారు. ఎంవీఆర్ శాస్త్రికి దేశ చరిత్ర తెలియకపోతే తన పుస్తకాలను చదవాలని సూచించారు.