nri: ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయక్కరలేదు
- స్పష్టం చేసిన ఆధార్ సంస్థ
- సేవలకు ఆధార్ లింక్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ఎన్నారైలు
- వాటికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం
ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు తమ ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు గానీ, ఇతర ఆధార్ ఆధారిత సేవలకు గానీ లింక్ చేయాల్సిన అవసరం లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత విభాగాలకు, కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ చట్టం పరిధిలోకి వచ్చిన వారి దగ్గరే ఆధార్ లింక్ గురించి ప్రస్తావించాలని, చాలా మంది ఎన్నారైలకు, భారత సంతతి వ్యక్తులకు ఆధార్ లేని కారణంగా వారికి మినహాయింపు ఇవ్వాలని పేర్కొంది. భారత ప్రభుత్వం అందజేసే వివిధ సేవలు, అవసరాలను తీర్చుకోవడంలో ఆధార్ లింక్ ప్రక్రియ తమకు అడ్డంకిగా మారిందని చాలా ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు చేసిన ఫిర్యాదుల మేరకు యూఐడీఏఐ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆధార్ లింక్ ప్రక్రియ నుంచి వారిని మినహాయించడం ద్వారా వారు ఎదుర్కుంటున్న సమస్యలకు చెక్‌పెట్టే అవకాశం ఉంది. అయితే ఆధార్ మినహాయింపు అమలు చేసే ముందు వారు ఎన్నారై, పీఐఓ, ఓసీఐ అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాలని ఆధార్ సంస్థ ఆదేశాల్లో తెలిపింది.