Jewelery shop: స్కీముల పేరుతో 21 వేల మందికి 75 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన జ్యుయలరీ షాపు
- చెన్నైలోని టీనగర్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే నాతెల్లా సాంపత్తు చెట్టి (ఎన్ఎస్సీ) జ్యుయలరీ షాపు
- దీపావళి ఆఫర్ చెల్లించడంలో విఫలం కావడంతో వెలుగులోకి వచ్చిన మోసం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వెయ్యి మంది కస్టమర్లు
తమిళనాడులో జ్యుయలరీ షాపు ఘరానా మోసం వెలుగుచూసింది. దాని వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని టీనగర్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే నాతెల్లా సాంపత్తు చెట్టి (ఎన్ఎస్సీ) జ్యుయలరీ షాపు ఘరానా మోసానికి పాల్పడింది. స్కీములు, ఆఫర్ల పేరుతో 21,000 మంది కస్టమర్లకు 75 కోట్ల రూపాయల మేర కుచ్చు టోపీ పెట్టింది. అద్భుతమైన పథకాల పేరుతో నెలవారీ వాయిదాలు చెల్లించిన వెయ్యిమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రంగనాథ్ గుప్తా సహా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎండీ కుమారులైన ప్రభన్నకుమార్, ప్రసన్న కుమార్, గుప్తా బంధువు కోటా సురేష్ లపై ఆర్థిక నేరాల వింగ్ ( ఈఓడబ్ల్యు) అధికారులు కేసులు నమోదు చేశారు. అనంతరం వీరి నివాసాలు, కార్యాలయాల్లో తనఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విలువైన ఆస్తిపత్రాలు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంస్థకు చెందిన షో రూంలతో పాటు, వారికి ఉన్న రెండు ఇళ్లు, అంబత్తూర్ లో రెండు ఎకరాల విస్తీర్ణంలో కట్టించిన స్కూలు తదితరాలను సీజ్ చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, దీపావళి పథకం చెల్లించడంలో వీరు విఫలం కావడంతో బాధితులు ఫిర్యాదు చేయగా, కోట్లాది రూపాయల మోసం జరిగిందని సాక్షాత్తూ ఎండీ అంగీకరించడం విశేషం.