apple: ఆపిల్ ఐఫోన్ టెన్ ఫేస్ ఐడీలో లోపం... తల్లి ఫోన్ ను అన్ లాక్ చేసిన పదేళ్ల బుడతడు!
- పోలికలు ఉండటంతో సులభంగా తెరుచుకున్న ఐఫోన్ టెన్
- వైరల్ అవుతున్న వీడియో
- ఫేస్ ఐడీ సెక్యూరిటీ గురించి గొప్పగా చెప్పిన ఆపిల్
ఆపిల్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన ఐఫోన్ టెన్‌లో చెప్పుకోదగ్గ ఫీచర్ ఫేస్ఐడీ. గతంలో ఉన్న టచ్ఐడీతో పోల్చితే ఫేస్ఐడీ చాలా భద్రమైనదని ఆవిష్కరణ వేడుకలో ఆపిల్ ప్రతినిధి బీరాలు పలికిన సంగతి తెలిసిందే. అయితే అతని బీరాలను తలదన్నేలా ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన తల్లి ముఖంతో లాక్ అయిన ఐఫోన్ టెన్ను పదేళ్ల కుమారుడు తన ముఖం చూపించి అన్‌లాక్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. పాత టచ్ఐడీ లాకింగ్‌లో ఒకటి కంటే ఎక్కువ మంది వేలిముద్రలను సేవ్ చేసే సదుపాయం ఉండటంతో, ఆయా వేలిముద్రలు ఉన్నవారు ఫోన్‌ను అన్‌లాక్ చేసేవారు. కానీ ఫేస్ఐడీలో మాత్రం ఒక్కరి ముఖాన్ని మాత్రమే భద్రపరిచే సదుపాయం ఉంది. వారు మినహా మిగతా వారు ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయలేరు. కానీ ఈ తల్లీకొడుకులు చేసిన పని ఆపిల్ సెక్యూరిటీపై అనుమానం కలిగేలా చేస్తోంది.
వీరు మాత్రమే కాదు... వియత్నాంకు చెందిన ఓ సెక్యూరిటీ అధికారి త్రీడీ మాస్క్ ద్వారా ఐఫోన్ ఫేస్ఐడీని అన్‌లాక్ చేశాడు. అలాగే అమెరికాకు చెందిన ఇద్దరు కవలలు కూడా ఐఫోన్ ఫేస్ఐడీని బైపాస్ చేయగలిగారు. ఆ వీడియోలు కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి.