viral reddy: మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డ చైతన్యపురి కార్పొరేటర్!
- ఇటీవలే ఓ ఇంటి యజమాని, కూలీలపై దౌర్జన్యానికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేత
- తాజాగా భాస్కర్ రెడ్డి అనే వ్యాపారిపై దాడి
- రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని మళ్లీ ఇవ్వని విఠల్ రెడ్డి
- సదరు కార్పొరేటర్‌పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు
టీఆర్ఎస్ నేత, జీహెచ్ఎంసీ చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఇటీవలే ఓ ఇంటి యజమాని, కూలీలపై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా వుండగా, తాజాగా ఆయన మరో కేసులో ఇరుక్కున్నాడు.
వైన్ షాప్ టెండర్లకు సంబంధించి తెలంగాణ సర్కారు ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో తన కొడుకు యశ్వంత్ రెడ్డి పేరు మీద మూసారాంబాగ్‌లో ఒక వైన్ షాప్‌ను దక్కించుకున్న విఠల్ రెడ్డి.. మరో లిక్కర్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి వ్యాపారం కొనసాగించడానికి మాట్లాడుకున్నాడు. ఈ క్రమంలో అతని వద్ద నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా, వ్యాపారంలో వాటా కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో తన కుమారులు, అనుచరులతో కలిసి సదరు కార్పొరేటర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అతని ఇంటిపై రెక్కీ నిర్వహించి, నిన్న రాత్రి విజయ్‌భాస్కర్ రెడ్డిపై దాడి చేయించాడు. డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని కేసు పెడతావా? అంటూ కొట్టారు. ఈ విషయాలన్నీ తన ఫిర్యాదులో పేర్కొని, విజయ్‌భాస్కర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. విఠల్ రెడ్డి, అతని కుమారులతో తనకు ప్రాణభయం ఉందని భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.