kancha ilaiah: బ్రాహ్మణులు మాత్రమే హిందువులు: ప్రొ.కంచ ఐలయ్య
- దేశంలో ఒకరు ఆధ్యాత్మిక రంగాన్ని.. మరొకరు వ్యాపార రంగాన్ని శాసిస్తున్నారు
- పూజారి అయ్యే హక్కు ఎవరికి ఉండదో వారు హిందూ మతంలో ఉన్నట్లు కాదు
- బ్రాహ్మణులకు మాత్రమే పూజారయ్యే హక్కు ఉంది
- భారత్లో సర్వమానవ సమానత్వం ఉండాలని కోరుకుంటున్నాను
హిందూ మతంలో ఒకరు (బ్రాహ్మణులు) ఆధ్యాత్మిక రంగాన్ని మరొకరు (ఆర్యవైశ్యులు) వ్యాపార రంగాన్ని శాసిస్తున్నారని ప్రొ.కంచ ఐలయ్య అన్నారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... పూజారి అయ్యే హక్కు ఎవరికి ఉండదో వారు ఆ మతంలో ఉన్నట్లు కాదని హిందూ మతాన్ని ఉద్దేశించి అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే అన్ని వర్గాల వారికి మతంలో సమానత్వం కావాలని అన్నారు.
హిందువుగా పుట్టిన తనకు తిరుపతిలోని హిందు దేవుడి వద్ద పూజారి అయ్యే హక్కు లేదని కంచ ఐలయ్య అన్నారు. హిందూ మతంలో ఉన్న వారందరికీ పూజారి అయ్యే హక్కు ఉండాలని ఐలయ్య అన్నారు. బ్రాహ్మణులకు మాత్రమే పూజారయ్యే హక్కు ఉంటే వారు మాత్రమే హిందువులని వ్యాఖ్యానించారు. 'నేను హిందువుని ఎట్లయిత?' అని అందుకే ఆ పుస్తకం రాశానని అన్నారు. ఇక్కడి కుల వ్యవస్థ వల్లే మతమార్పిడిలు జరుగుతున్నాయని, ఇప్పుడు కేవలం భారత్, నేపాల్లో మాత్రమే హిందు మతం బతికి ఉందని అన్నారు.
తిరుపతి లాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ బ్రాహ్మణులు ఆక్రమించుకున్నట్లుగా వ్యవస్థ ఉందని, ఇతర కులాలవారిని పూజారులు కానివ్వడం లేదని కంచ ఐలయ్య అన్నారు. ప్రేమ, సహనం, శాంతి వంటి వాటిలో మతాలు పోటీపడాలి కానీ, ఇతర మతస్తులను తిట్టడంలో కాదని అన్నారు. భారత్ హిందూ దేశంగా మారాలని, హిందూస్థాన్గా మారాలని హిందువులు అంటున్నారని, అంటే బ్రాహ్మణుల దేశం కావాలి, ఆర్యవైశ్యుల దేశం కావాలి అని అంటున్నట్లేనని అన్నారు. హిందూ దేశంగా మారితే దళితులను, కిందికులాల వారిని పూర్తిగా తొక్కేస్తారా? అని ప్రశ్నించారు. భారత దేశంలో సర్వమానవ సమానత్వం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.