rudrama devi: రాష్ట్రం విడిపోకుండా ఉంటే 'రుద్రమదేవి'పై పెను రభస జరిగుండేది... : మోహన్ గోటేటి
- 'రుద్రమదేవి'కి గుర్తింపు దక్కాల్సింది
- సినిమా వ్యవస్థకు కులాన్ని ఆపాదించొద్దు
- సోషల్ మీడియాలో ఇంత దిగజారుడుతనమా?
- సినిమాకు సంబంధం లేనివాళ్లతో కూడా వివాదాలు
'బాహుబలి'కి తొలుత అవార్డు ఇవ్వకుండా చివర్లో చేర్చారని ఈ ఉదయం ఓ దినపత్రికలో వార్త చూశానని చెప్పిన ఆయన, అదే నిజమైతే చాలా విచారకరమైన విషయమని సీనియర్ జర్నలిస్ట్ మోహన్ గోటేటి పేర్కొన్నారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా, బాహుబలి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకెళ్లిందని గుర్తు చేశారు. అలానే 'రుద్రమదేవి'కి గుర్తింపు లభించి వుండాల్సిందన్నారు.
ఒకవేళ తెలుగు రాష్ట్రాలు విడిపోకుండా ఉండి వుంటే, 'రుద్రమదేవి'కి అవార్డు రాకపోవడంపై చాలా గొడవలు జరిగుండేవని మోహన్ గోటేటి వ్యాఖ్యానించారు. రేపు తెలంగాణ ప్రభుత్వం ఆ చిత్రానికే బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చినా ఇవ్వొచ్చని తెలిపారు. గుణశేఖర్ బాధను అర్థం చేసుకోవాలని కోరారు. పసుపు నందులని మొదలు పెట్టి, కమ్మ అవార్డుల వరకూ వివాదం వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. సినిమా వ్యవస్థలో కులాన్ని ఆపాదించవద్దని చెప్పారు.
సినిమావాళ్లు చాలా చీప్ అని బయట ఉన్న టాక్ ను కొందరు సోషల్ మీడియాలో నిజం చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది బాలకృష్ణ అవార్డులను ఫైనల్ చేశారని అంటుంటే, మరికొందరు చంద్రబాబు ఫైనల్ చేశారని తనతో వ్యాఖ్యానించారని, అలా జరగదని తాను సర్దిచెప్పానని వివరించారు. ఒకవేళ అదే జరిగివుంటే, కమలహాసన్, రజనీకాంత్ లకు ఇచ్చినట్టుగా ఒక ఏడాది 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు చిరంజీవి పేరును కూడా చంద్రబాబు చేర్చుండేవారని చమత్కరించారు. వివాదం చంద్రబాబు దృష్టికి ఇప్పటికే వెళ్లి ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా ఆయన చూసుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు. తాను అవార్డు కమిటీలో ఉన్న సమయంలో ఓ హీరోయిన్ చేసిన ఫైట్ చూసి, ఉత్తమ నటి అవార్డును ఇవ్వాలని ఓ మెంబర్ కోరాడని, అది గ్రాఫిక్స్ అని చెబితే వినలేదని, ఆ మెంబర్ ఓ బ్యాంకు అధికారని, ఇలా సినిమాల గురించి సరైన అవగాహన లేనివాళ్లను భాగం చేయడం వల్ల కూడా వివాదాలు పెరుగుతున్నాయని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.