ncp: గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్!
- ఒంటరిపోరుకు సిద్ధమైన ఎన్సీపీ
- పొత్తుపై కాంగ్రెస్ తాత్సారం చేస్తోందంటూ ఆరోపణ
- ఒంటరిగానే మెరుగైన ఫలితాలను సాధిస్తామన్న ఎన్సీపీ
గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని కంగుతినిపించి, మోదీ హవాకు చెక్ పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ తో కలసి ఎన్నికల బరిలోకి దిగుతుందని భావించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తాజాగా ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎన్సీపీ నేడు అధికారిక ప్రకటనను వెలువరించింది. కాంగ్రెస్ పార్టీతో కలసి బరిలోకి దిగాలని తొలుత భావించామని... చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని... పొత్తు విషయంలో కాంగ్రెస్ తాత్సారం చేస్తోందని... అందుకే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించామని ప్రకటించింది.
గుజరాత్ లోని అన్ని స్థానాలకు పోటీ చేయాలని ఏడాదిన్నర క్రితమే అనుకున్నామని ఎన్సీపీ నేత ప్రఫుల్ కుమార్ పటేల్ చెప్పారు. ఒంటరి పోరుతోనే తాము మెరుగైన ఫలితాలను సాధిస్తామని, ఎక్కువ స్థానాలను గెలుచుకోగలమనే విశ్వాసం తమకు ఉందని తెలిపారు. 77 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఎన్సీపీ ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు, పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ తో నెరుపుతున్న మంతనాలపై కూడా గందరగోళం నెలకొంది. వీటన్నిటి నేపథ్యంలోనే, ఒంటరి పోరుకు ఎన్సీపీ సిద్ధమైంది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.