rosogolla: రసగుల్లా కనిపెట్టిన స్వీట్ తయారీ దారుడి బయోపిక్.. వచ్చే ఏడాది విడుదల!
- ఇటీవల రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు సంపాదించిన పశ్చిమ బెంగాల్
- 1868లో ఈ పదార్థాన్ని కనిపెట్టిన నోబిన్ చంద్ర దాస్
- వచ్చే ఏడాదికి 150 ఏళ్లు పూర్తి చేసుకోనున్న స్వీటు
ఒడిశాతో గత రెండున్నరేళ్లుగా పెట్టుకున్న వివాదంలో విజయం సాధించి, ఇటీవల తమ రాష్ట్రం పేరు మీదుగా తీపి పదార్థం రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు లభించినందుకు బెంగాలీలు చాలా సంతోషపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన పావెల్ అనే దర్శకుడు, రసగుల్లాను తయారుచేసిన స్వీట్ తయారీదారుడు నోబిన్ చంద్ర దాస్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు.
నోబిన్ చంద్ర దాస్ 1868లో రసగుల్లాను తయారుచేశాడు. వచ్చే ఏడాదికి రసగుల్లా తయారై 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ చిత్రాన్ని 2018లో విడుదల చేయాలని చిత్రాన్ని నిర్మించనున్న విండోస్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ చిత్రానికి `రసగుల్లా` అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వెల్లడించింది.