MS Dhoni: ఇవాంకా పర్యటన.. సదస్సుకు ధోనీ, దీపికలకు ఆహ్వానం.. సారీ చెప్పిన వైనం!
- వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్టు సమాచారం ఇచ్చిన ధోనీ, దీపిక
- హాజరుకానున్న సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్
- ఈ సదస్సుకు దక్షిణాసియా దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి
హైదరాబాద్లో ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ రానున్న నేపథ్యంలో భాగ్యనగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ సదస్సుకు ఓ దక్షిణాసియా దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానుండగా క్రీడారంగం నుంచి టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, బాలీవుడ్ ప్రముఖ నటి దీపిక పదుకునే సహా పలువురిని ఆహ్వానించారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ సదస్సుకు హాజరు కాలేకపోతున్నట్టు ధోనీ ఇప్పటికే సమాచారం అందించాడు. ‘హాలీవుడ్ టు నాలీవుడ్ టు బాలీవుడ్’ అనే అంశంపై దీపిక ప్రసంగించాల్సి ఉండగా ఆమె రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇక క్రీడారంగం నుంచి ఆహ్వానం అందుకున్న వారిలో సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్ తదితరులు సదస్సుకు హాజరుకానున్నారు.