olx: త్వరలో ఓఎల్ఎక్స్, క్వికర్‌లకు పోటీ ఇవ్వబోతున్న ఫేస్‌బుక్?
- దేశంలో 'మార్కెట్ ప్లేస్' ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడి
- ప్రయోగాత్మకంగా ముంబైలో అమలు చేయనున్న ఫేస్‌బుక్
- తర్వాత దేశవ్యాప్తం చేసే యోచన
2016లో 'మార్కెట్ ప్లేస్' పేరుతో వస్తువులు కొనే, అమ్మే ప్లాట్‌ఫాంను ఫేస్‌బుక్ ఆవిష్కరించింది. అయితే ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు భారత ఈ-కామర్స్ మార్కెట్ రోజురోజుకీ పెరుగుతున్న కారణంగా త్వరలో ఇక్కడ కూడా మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఇందుకు సంబంధించి ముంబై నగరంలో అధ్యయనాలు చేపట్టినట్టు ఫేస్‌బుక్ తన బ్లాగులో వెల్లడించింది. ముందు ముంబైలో ప్రయోగాత్మకంగా అమలు చేసి, తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ భారత మార్కెట్‌లోకి ఫేస్‌బుక్ ప్రవేశిస్తే ఇప్పటికే అలాంటి వ్యాపారం చేస్తున్న ఓఎల్ఎక్స్, క్వికర్ లాంటి వెబ్‌సైట్‌లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
ఇక ఈ మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫాం ద్వారా ఫేస్‌బుక్ ఒక కమ్యూనిటీని సృష్టిస్తుంది. వస్తువులు అమ్మే వారు, కొనే వారికి మధ్య వారధిగా నిలుస్తుందే మినహా ఎలాంటి పేమెంట్ ఆప్షన్‌ను అనుమతించదు. 2026లో భారత్‌లో ఈ-కామర్స్ బిజినెస్ 200 బిలియన్ డాలర్లకు చేరనుందని వస్తున్న అధ్యయనాల నేపథ్యంలో ఫేస్‌బుక్ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.