one song: ఒక్క పాట... 150 మంది కళాకారులు... దివ్యాంగ పిల్లల కోసం తమ వంతు సాయం... వీడియో చూడండి
- యూనిసెఫ్ ఇండియా సహకారంతో రూపొందించిన బెంగళూరు సంగీతదర్శకులు
- నటులు, గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు పాల్గొన్న వీడియో
- దేశ, విదేశీ భాషల్లో పాట
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా 150 మంది కళాకారులు.. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ముందుకు వచ్చారు. వారి సహాయార్థం యూనిసెఫ్ ఇండియా సహకారంతో బెంగళూరు సంగీత దర్శక ద్వయం వెంకీ - వరుణ్‌లు రూపొందించిన వీడియో కోసం ఈ కళాకారులందరూ తమ వంతు సాయంగా కళను ప్రదర్శించారు.
`బన్ని ముందే... హేళి ఇందే... నావూ ఎల్లా ఉందే (ముందుకు రండి.. ఇవాళ అనండి.. మనమంతా ఒక్కటే)` అనే సందేశాన్నిచ్చే పదాలతో `ద వన్ సాంగ్` పేరిట ఈ పాటను విడుదల చేశారు. ఇందులో పునీత్ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాఘవేంద్ర వంటి కన్నడ నటులతో పాటు కేఎస్ చిత్ర, సుశీల, బాలసుబ్రహ్మణ్యం, బాంబే జయశ్రీ, వాణీ జయరాం వంటి దిగ్గజ గాయనీ గాయకులు ఉన్నారు.
కన్నడ ఆధార భాషగా తీసుకుని తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, పంజాబీ వంటి దేశీయ భాషలతో పాటు స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ వంటి విదేశీ భాషల్లోనూ వివిధ కళాకారులు సందేశాన్ని ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.