indian railway: సిగ్నల్ వైఫల్యాలకు చెక్ పెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం?
- యోచిస్తున్న భారతీయ రైల్వే
- రిమోట్ మానిటరింగ్ ద్వారా సమస్యల తగ్గింపు
- కాపలా లేని సిగ్నళ్ల కారణంగా రైలు ప్రమాదాలు
సిగ్నల్ వైఫల్యాల కారణంగా జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దీని ద్వారా ఎప్పటి కప్పుడు రైల్వే లైన్లను రిమోట్ మానిటర్ చేసి, సిగ్నలింగ్ ఇచ్చే సదుపాయం కలుగుతుంది. రైలు మార్గంలో ఏదైనా సిగ్నల్ ఫెయిల్యూర్ ఉన్నా, కాపలా లేని సిగ్నళ్లు ఉన్నా ముందే హెచ్చరికలు వస్తాయి. దీంతో రైలు ప్రమాదాలను అరికట్టడమే కాకుండా సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి.
ప్రస్తుతం ఈ సిగ్నల్ మానిటరింగ్‌ని మాన్యువల్‌గా చేస్తున్నారు. దీని వల్ల ప్రమాదం జరిగిన తర్వాత గానీ, సిగ్నల్ వైఫల్యం గురించి తెలియడం లేదు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం వల్ల ప్రమాదం జరగడానికి ముందే ఎప్పటికప్పుడు సిగ్నల్ వైఫల్యాలను అంచనా వేసి, బాగుచేయవచ్చు. రిమోట్ కండిషన్ మానిటరింగ్‌లో సెన్సార్లు ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా రైల్వే లైన్లను పర్యవేక్షించడమే కాకుండా సిగ్నళ్లను మార్చడం, ఇంటర్‌లాకింగ్, ట్రాకింగ్ వంటి పనులు కూడా చేసుకోవచ్చని సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు.
బ్రిటన్‌లో ఇప్పటికే ఈ సిగ్నలింగ్ విధానం అందుబాటులో ఉంది. పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వే జోన్లలోని అహ్మదాబాద్ - వడోదరా, బెంగళూరు - మైసూరు లైన్లలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా మొదట అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.