Hyderabad: హైదరాబాద్లో బిచ్చమెత్తుకుంటున్న కోటీశ్వరులు... గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో బయటపడుతున్న కొత్త నిజాలు!
- లండన్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి బిచ్చగత్తెగా మారిన ఫర్జూనా
- గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో బిచ్చగత్తెగా మారిన రబియా బైస్రా
- వివరాలు తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు
హైదరాబాద్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సిటీలో భిక్షాటనను నిషేధించారు. దీంతో ఇక్కడ ఉన్న బిచ్చగాళ్లందరినీ చర్లపల్లి ఓపెన్ జైల్లో ఉన్న ఆనందాశ్రమానికి తరలించారు. అక్కడ వాళ్లందరి వివరాలను నమోదు చేస్తున్నపుడు వారిలో కొంతమంది కోటీశ్వరులు, గొప్పగా బతికిన వారు వున్నారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నారని తేలింది.
అక్కడికి వచ్చిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ. ఉదాహరణకు అందులో ఫర్జూనా అనే 50 ఏళ్ల మహిళ తాను ఎంబీఏ పూర్తి చేసి, లండన్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లంగర్ హౌస్లో భిక్షాటన చేస్తున్న ఆమె వివరాలు చెబుతున్నపుడు ఆమె ఇంగ్లీషులో మాట్లాడటం విని పోలీసులు కంగుతిన్నారు. భర్త చనిపోయాక, సమస్యలు తీవ్రం కావడంతో మనశ్శాంతి కోసం భిక్షాటన చేయమని ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న కొడుకు ఇచ్చిన సలహా మేరకు ఆమె బిచ్చగత్తెగా మారినట్లు వెల్లడించింది. తర్వాత ఆమె కుమారుడు వచ్చి అఫిడవిట్ సమర్పించి ఫర్జూనాను తీసుకెళ్లాడు.
అలాగే రబియా బైస్రా అనే మహిళది కూడా ఇలాంటి కథే. ఆమె అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్. కోటీశ్వరురాలు. దగ్గరి బంధువులే ఆస్తి కోసం మోసం చేయడంతో ఓ దర్గా దగ్గర బిచ్చగత్తెగా మారాల్సి వచ్చింది. ఆమెను ఆశ్రమానికి తరలించారని తెలిసి బంధువులు వచ్చి జాగ్రత్తగా చూసుకుంటామని డిక్లరేషన్ ఇవ్వడంతో పోలీసులు ఆమెను వారితో పంపించారు.