rahul gandhi: రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే 'కాంగ్రెస్ ముక్త భారత్' ఈజీ అవుతుంది!: యూపీ సీఎం యోగి
- రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ సమాయత్తం
- రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే 'కాంగ్రెస్ ముక్త భారత్' ఈజీ
- కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణం
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడైతే తాము కోరుకుంటున్న ‘కాంగ్రెస్ ముక్త భారత్’( కాంగ్రెస్ లేని భారత్) సులభం అవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. గోరఖ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణమని అన్నారు. అందులో కొత్తదనం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ ఏర్పాటు కావాలంటే రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సంసిద్ధమవుతున్నారన్న నేపథ్యంలో యోగి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఇదిలా ఉంచితే, 2014 ఎన్నికల్లో బీజేపీ 'కాంగ్రెస్ ముక్త భారత్' నినాదంతో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.