Jammu and Kashmir: కశ్మీరీ యువతకు శుభవార్త... 4,500 కేసులు ఎత్తివేత!
- కశ్మీర్ లో ఆందోళన లేదా నిరసన అంటే రాళ్ల దాడే
- మసీదులో ప్రార్థనలు పూర్తికాగానే పోలీసులపై యువత రాళ్ల దాడులు
- భద్రతా సిబ్బంది, సైన్యం, పోలీసులే లక్ష్యంగా రాళ్ల దాడులు
కశ్మీరీ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాళ్లు విసిరిన ఘటనల్లో 4,500 కేసులు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. కశ్మీర్ లో నిరసన లేదా ఆందోళన ఏది తెలియజేయాలన్నా సైన్యం, పోలీసులపై రాళ్ల దాడులు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన తరువాత పాకిస్ధాన్, ఐఎస్ఐఎస్ జెండాలు, రాళ్లు చేబూనిన యువకులు వీధుల్లోకి వచ్చి భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తూ సైన్యం, భద్రతా దళాలు, పోలీసులపై రాళ్లు విసిరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ఈ ఆందోళనలు పెచ్చుమీరిన సమయాల్లో వాటిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు వినియోగించే పెల్లెట్ గన్స్ తూటాల బారినపడి ఆందోళనకారులు గాయాలపాలవుతుంటారు. ఈ మధ్యకాలంలో కశ్మీర్ లో ఈ తరహా ఆందోళనలు తగ్గిన నేపథ్యంలో కశ్మీరీ యువతపై పెట్టిన 4,500 రాళ్ల దాడుల కేసులను ఎత్తివేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. కశ్మీరీ యువతలో మార్పు వస్తే మిగిలిన కేసులన్నీ ఎత్తేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది.