swamy paripoornananda: 'భావ ప్రకటనా స్వేచ్ఛ' పేరుతో 'స్వేచ్ఛా భావ ప్రకటన' చేస్తున్నారు: 'పద్మావతి'పై స్వామి పరిపూర్ణానంద ఫైర్
- చరిత్రను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి
- రాణి పద్మావతి ఆత్మ గౌరవానికి ప్రతీక
- భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' సినిమాపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో పద్మావతి చరిత్రను వక్రీకరించారని... ఆమెపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ రాజ్ పుత్ లు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. రాణి పద్మావతి జీవితం ఒక చరిత్ర అని... చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లేకపోతే, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. పద్మావతి జీవితం ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయడం చేస్తున్నారని మండిపడ్డారు. 'భావ ప్రకటనా స్వేచ్ఛ' పేరుతో 'స్వేచ్ఛా భావ ప్రకటన' చేస్తున్నారని విమర్శించారు. ఇది సమాజానికి అంత మంచిది కాదని చెప్పారు.